వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
"వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికిన్.
భావము:
తన భాగవతరచన సకలశుభపరంపరలతో సాగాలని మహాభక్తశిఖామణి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని సంభావిస్తూ ప్రార్థిస్తున్నాడు.
నేను అతిశయించినభక్తితో పరమశివునకు మ్రొక్కుతాను. ఆ శివుడు ఎవరికీ నిలువ రించటానికి సాధ్యం కాని తాండవనృత్యం ఆటగా గలవాడు. సర్వప్రాణులయందూ దయతో అలరారేవాడు. శూలం కలవాడు. పర్వతరాజతనయ మోము అనే తామరపూవునకు కిరణాల మాలలుగలభాస్కరుడు అయినవాడు. చిన్నిచందమామను తలపైపూవుగా తాల్చినవాడు. బ్రహ్మతలను గోటితో గిల్లి ఆపుఱ్ఱెను విలాసంగా చేతిలో ధరించి తిరుగాడుతూ ఉండేవాడు. ఒకపెద్దపర్వతం వంటిది మన్మథుని గర్వం. దానికి అందరూ అణగిమణగి ఉండటం తప్ప మరొకదారిలేదు. అటువంటి గర్వపర్వతాన్ని అవలీలగా పెల్లగించి పారవేసిన వాడు. నారదుడు మొదలైన జ్ఞానసంపన్నుల హృదయపద్మాలలో మనోజ్ఞమైననాదం చేస్తూ తిరుగాడే తుమ్మెద వంటివాడు.
అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను."
