ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టివి

ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టివి

bookmark

    "ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.

భావము:
నాలుగుమోములదేవర బ్రహ్మయ్య జ్ఞానవిజ్ఞానాల స్వరూపమైన సరస్వతి వేదాల రూపంతో ఆయన నాలుగుమోములలోనూ నిరంతరం కదలాడుతూ ఉంటుంది. తననోటి నుండి భాగవతపరమార్థం రసాత్మకంగా వెలువడాలంటే ఆపరమేష్ఠి అనుగ్రహం కూడా కావాలి. అందువలన పోతన తన మధురమంజులవాక్కులతో బ్రహ్మను కొనియాడు తున్నాడు. 
ఆయన ధాత. సకలసృష్టినీ పట్టినిలిపేవాడు. ఆసృష్టిలో కదలాడేవీ, కదలాడనివీ అయిన రెండు విధాలభూతాలున్నాయి. ఆ అన్నింటి తీరుతెన్నులను మొత్తంగా తెలిసినవాడు. చదువులతల్లి హృదయానికి సౌఖ్యం కూర్చేజ్ఞానసంపద ఆయన సొమ్ము. వేదాలరాశులను ఇది ఇది అని నిర్ణయించి జనులకు తెలివితేటలను ప్రసాదించినవాడు. ఇంద్రుడుమొదలైన దేవతలం దరినీ వారివారి విధులలో నడిపించే నాయకుడు. పాపాలు ఏమాత్రమూ తన నంటకుండా పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నవాడు. తనయెడల వినయంతో ఉన్నవారి నందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. తమ తపశ్శక్తితో ఈ భూమి నంతటినీ పట్టినిలుపుతున్న తాపసులం దరికీ శుభాలను పెద్దగా ప్రదానం చేస్తూఉండేవాడు. అట్టి బ్రహ్మదేవునకు చాలాపెద్ద ఎత్తున పూజ చేస్తాను.

చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చు వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధను లందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను."