ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
"ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.
భావము:
బ్రహ్మమొదలైనదేవతలు కూడా తమతమపనులు ప్రారంభించేటప్పుడు అతనికి మ్రొక్కి కృతకృత్యులవుతారట. ఇంక మానవుల సంగతి చెప్పనేల? కాబట్టి ఉత్తమపురుషుడైన పోతనా మాత్యుడు భాగవతరచనామహాకార్యంలో తనకు ఏవిధమైన విఘ్నాలూ కలుగ కూడదని గజాననునికి మ్రొక్కులు చెల్లిస్తూన్నాడు.
ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించు కుంటాడు. చెడుపనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకొన్నవారిని ఉల్లాస పరుస్తూ ఉంటాడు. విఘ్నములనే చిక్కుముడులుగల లతలను త్రెంపి వేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్నిలోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు. కుడుములను ఆప్యాయంగా ఆరగించేవాడు. పొగరెక్కిన ఎలుక వాహనం అయినవాడు. సర్వప్రాణికోటియందూ ప్రసన్నతకలవాడు. అట్టి గణపయ్యకు ఆదరం తో మ్రొక్కుతాను.
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను."
