హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
"హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోఁణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరియిచ్చున్ నిత్యకల్యాణముల్.
భావము:
లక్ష్మీదేవిని లోకమాత అంటారు. అనటంకాదు ఆమె లోకమాతయే. సమస్తప్రాణికీ సర్వమూ అమ్మలాగా అనురాగం అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె అడగకపోయినా బిడ్డలకు అన్నీ యిస్తుంది. కాకపోతే వివేకం కలవ్యక్తులు ఏది తమకు శాశ్వతంగా శుభాన్ని స్తుందో దానినే అడుగుతారు. పోతన ఇందిరామాతను ఇలా ప్రార్థిస్తున్నాడు.
శ్రీమహావిష్ణువునకు పట్టపురాణి, పుణ్యాలరాశి, సంపదలకు పెద్దనిధి. ప్రాణులందరి మూడుకరణాలకూ పరమానందం అందించే చందురుని అక్కగారు. చదువులతల్లి అయిన భారతి, జ్ఞానప్రసూన అయిన గిరిజ ఆమెకు ఇష్టసఖులు. వారిలో నిరంతరం ఆడుకుంటూ ఉంటుంది. తమ వికాసంతో జనులహృదయాలను వికసింపజేసే తామరపూవులలో నివసించే ముద్దరాలు. లోకాలన్నీ పూజించే యిల్లాలు. అద్భుతంగా కాంతులను విరజిమ్ముతూ జనుల లేములను పోగొట్టేతల్లి. సిరి. ఆమె మనకు అనంతమైన కల్యాణాలను ఇస్తుంది.
దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రొహించు గాక."
