శారద నీరదేందుఘనసార పటీరమరాళమల్లికా
"శారద నీరదేందుఘనసార పటీరమరాళమల్లికా
హారతుషార ఫేనరజతాచల కాశఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడుగల్గు భారతీ!
భావము:
దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్పతపశ్శక్తితో గానీ సాధ్యం కాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నాడు పోతనగారు.
""సర్వశుక్లా సరస్వతీ"" సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషులభావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్రవస్తువులు కొన్నింటిని ఉపమానా లుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నాడు పోతన. శరత్కాలమేఘం, చందమామ, కర్పూరం, నీటినురుగు, వెండికొండ, రెల్లుపూలు, మొల్లలు, మందారాలు, అమృతసముద్రం, తెల్లని తామరలు, దేవతలనది మందాకిని - అనేవాని శుభమైన ఆకారంవంటి ఆకారంతో ప్రకాశించే నిన్ను , ఓతల్లీ! భారతీ! హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకొని చూడగలగటం ఎన్నటి కౌతుందో!
భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!"
