బావిలో చేద వేయుట

బావిలో చేద వేయుట

bookmark

బావిలో చేద వేయుట:

కావలసినవి:

ఒక పళ్ళెములో పసుపు, కుంకుమ, మోడిముద్దలు 3, వెల్లుల్లిపాయలు 3, శనగలు, సాంబ్రాణి కడ్డీలు, వత్తి, పత్తి, పూలు, ఆకులు, పండ్లు, వక్కలు, అగ్గిపెట్టె, పత్తిగింజలు సర్దుకొనవలెను.

బావి వద్దకు వెళ్ళునప్పుడు బాలింతలకు నడికట్టు, నెత్తినగుడ్డ, పొత్తిగుడ్డ వుంచవలెను. 3 బిందెలకు బయటవైపు సున్నము రౌండుగా రాయవలెను. 3 పోగుల పసుపు దారముతో తమలపాకు ముడివేసి దానిని బిందెకు కట్టవలెను. ఒక బిందెలో కొద్దిగ మజ్జిగ 10, 11 పత్తిగింజలు, తమలపాకు వేయవలెను. ఈ బిందె బాలింత పట్టుకొనవలెను. 2 బిందెలు వేరేవాళ్ళు పట్టుకొనవలెను. బావివద్దకు వెళ్ళునప్పుడు బాలింత పత్తిగింజలు చల్లుతూ వెళ్ళవలెను. బావికి గుండ్రముగా పసుపురాసి బొట్టుపెట్టవలెను. బావి లేనిచో బోరింగు వద్ద చేయవచ్చును. బావి వద్ద 3 రాళ్ళు కాని, 3 మట్టిముద్దలు పెట్టి పసుపురాసి బొట్టు పెట్టి గౌరీదేవి పాటపాడుతూ పూజ చేసుకోవాలి. నైవేద్యము పెట్టాలి. పూజ అయినాక బిందెలో తమలపాకు పట్టుకుని మజ్జిగ, ధారగా బావిలో విడుస్తూ "గంగాభవాని తల్లి, మజ్జిగచుక్క తీసుకుని పాలచుక్క మాకు ఇవ్వు" అంటూ పత్తిగింజలు, తమలపాకు, బావిలో వదులుదురు.

బావిలో నీళ్ళు తోడి 3బిందెలలో పోయవలెను. బాలింత 3 చేదలు తొడినాక పక్కవాళ్ళు తోడి 3 బిందెలు నింపవచ్చును. ముద్ద అందుకొనువారికి మోడిముద్దలు 3, వెల్లుల్లుపాయలు 3, పండు, తాంబూలము, శనగలు కొంగులో పెట్టవలెను. బిందెలో నీళ్ళు తాకి, ముద్ద ఇచ్చిన వారి వీపుమీద "ఏటా బాలింత ఏటా శూలింత" అంటూ రెండు చేతులతో కొట్టవలెను. ముద్ద తీసుకొనిన వారు బాలింత వీపు మీద అలాగే కొట్టవలెను. బిందెలు చేతికి ఇవ్వవలెను, బిందెలు తీసుకుని లోపలకు వచ్చునప్పుడు గుమ్మము వద్ద వాళ్ళ భర్త పేరు చెప్పి లోపలకు రావలయును. బిందెలు పూజమందిరము వద్ద పెట్టి నమస్కరించాలి. వెళ్ళునప్పుడు ఒక గుమ్మము, లోపలకు వచ్చునప్పుడు వేరు గుమ్మము గుండా రావలయును. కడుపుచున్న వాళ్ళు వున్నచో వీరికి ఎదురు రాకూడదు.

మోడిముద్దలు తయారు చేయు విధానం..
కావలసినవి :
మోడిపిండి - 1 డబ్బా
మినపపిండి - 2 డబ్బాలు
బెల్లము - 3 డబ్బాలు
మోడిపుల్లలు వేయించి మిక్సిలో పొడి చేసి ఆ పిండిలో మినపపిండి, బెల్లము, నెయ్యి కలిపి ముద్దలు చేయాలి.