అంబ, నవాంబుజోజ్వల కరాంబుజ, శారదచంద్రచంద్రికా
"అంబ, నవాంబుజోజ్వల కరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుటభూషణరత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబర వీధివిశ్రుతవిహారి, ననుం గృపఁజూడు భారతీ!
భావము:
కవిత్రయంలో మూడవవాడు ఎఱ్ఱాప్రెగ్గడ. అత్యద్భుతమైన వినయశీలంగల మహాకవి. అతడు అమ్మభారతిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. పోతన మహాకవి ఆపద్యం అందానికి అబ్బురపడి, ఆనందపడి, అది తన భాగవత మహాకావ్యంలో తిలకంలాగా ఉండాల ని కోరుకొని చేర్చుకున్నాడనుకుంటారు పోతన సచ్ఛీలం ఎరిగిన సగృదయులు.
అమ్మా! భారతీ! అప్పుడప్పుడే వికసిస్తున్నపద్మపు కాంతులతో వెలిగిపోతున్న, పద్మంవంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జిలుగులవంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా నిస్పష్టంగా కాన వస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదయిన ప్రభావాన్ని వేదసూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞాన సంపదను హాయి గా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగనవీథిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లీ.
తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్త్రుతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!"
