ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్

bookmark

"ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.

భావము:
తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాలకోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైనపని అనిపించింది. అంతే కాదు. ఆపాడుపనికి యముడు అతిఘెరంగా శిక్షిస్తాడనికూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానాపాతకానికి ఒడిగట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. 
సాధారణంగా రాజ్యాలేలేవాళ్ళు నీచులై ఉంటారు. 'చిన్నినాపొట్టకు శ్రీరామరజ్ఞ' అనే భావనతో బ్రదకటమే ఆనీచత్వం. కానీ తాము గొప్పవారుగా లెక్కకెక్కాలి అని కూడా వారి ఉబలాటం. దానికోసం కవులకు ఏదో విదిలిస్తూ కృతిభర్తలుగా కీర్తిపొందాలనే దాహం వారికి ఉంటుంది. ఈ బమ్మెరపోతరాజు అటువంటి రాజులు ఇచ్చే అగ్రహారాలనూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ మొదలైన వాహనాలనూ, ధనాన్నీ కోరడు. ఎందుకంటే అవన్నీప్రాయంలో బాగానే ఉంటాయి. ముసలితనం వచ్చినప్పుడు అవే ముప్పుతిప్పలు పెడతాయి. శరీరం పోయిన తరువాత కాలుడు ఈపాపానికి శిక్షగా సహింపనలవికాని సమ్మెట పోటులతో సత్కరిస్తాడు. ఆశిక్షను పొందకుండా శ్రీమహావిష్ణువునకు అంకితంగా సమస్తమైన జగత్తుకూ మేలుకలిగే విధంగా భాగవతాన్ని ఈ బమ్మెరపోతరాజు 'ఒక్కడు' చెబుతున్నాడు. 
విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిగెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను."