లలితస్కంధము, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
"లలితస్కంధము, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
భావము:
భాగవతం ఒక కల్పవృక్షంలాగా కనపడుతున్నది పోతనమహాకవీంద్రునకు. కల్ప వృక్షం కోరినకోరికల నన్నింటినీ తీర్చి ఆనందాన్నందిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన్నగారి సంభావన.
ఇదిగోనండీ భాగవతమనే కల్పవృక్షం. ఈ వృక్షం బోదె చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలో స్కంధాలు లలితంగా ఉంటాయి. ఆ చెట్టుమూలం సార వంతమైన నల్లరేగడి మట్టితో ఉన్నట్లుగా భాగవతం నల్లనయ్యయే మూలంగా ఒప్పారు తున్నది. చిలుకలు కమ్మని నాదాలతో చెట్టును మనోహరం చేస్తాయి. ఈ భాగవతం శుకమహర్షి ఆలాపాలతో హృదయంగమంగా అలరారుతున్నది. చెట్టు నల్లుకొని పూలతీగలు దాని సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. భాగవతం మనోహరంగా ప్రకాశిస్తూఉంటుంది. కను విందుచేసే రంగురంగుల పూవులతో అందరినీ ఆకర్షిస్తుంది వృక్షం. ఈ భాహవతవృక్షం మంచిఅక్కరాలతో గొప్ప హృదయ సౌందర్యం కలవారికి చక్కగా తెలియవస్తుంది. అందమై నదీ కాంతులు విరజిమ్మూతూ ఉండేదే అయిన పాదు ఆ చెట్టును అలంకరిస్తున్నది. అందమై నవీ, వెలుగులుచిమ్ముతున్నవీ అయిన ఛందస్సునందలి వృత్తాలు ఈ భాగవతంలో ఉన్నాయి. అది గొప్ప ఫలాలను లోకానికి ఇస్తుంది. ఈ భాగవతం గొప్పదైన మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. ఈ చెట్టు పాదు విశాలమై పుష్టినీ తుష్టినీ కలిగిస్తూ ఉంటుంది. భాగవతానికి వ్యాస భగవానుడే ఆలవాలం. ఆ చెట్టును మంచిపక్షులు ఆశ్రయించి బ్రదుకుతూ ఉంటాయి. ఈ భాగవతాన్ని సత్-ద్విజులు-అంటే ఉత్తమ సంస్కారం కలపండితులకు ఆశ్రయింప దగినదై విరాజిల్లు తున్నది.
బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది."
