పెండ్లి పెట్టె
మంచిరోజున జాకెటు ముక్క, పసుపు, కుంకుమ ఒక పెట్టెలో పెట్టెదరు. వక్కలు, ఖర్జూరాలు, అప్పగింతల బట్టలు, తలంబ్రాల బియ్యము, తలంబ్రాలు బట్టలు, వడిగట్టు బియ్యం, ఆడపడుచు బట్టలు, తలపాగ, పిల్లమేనమామల బట్టలు, తాళిబొట్టు, భటువు, కంకణము, ఉత్తర జన్యములు, పెండ్లి కుమారునకు ఇచ్చు వెండి సామాను పెండ్లి కుమార్తెకు ఇచ్చు నగలు సర్దవలెను.
వడిగంటు బియ్యము:
పెద్దసైజు కండువాలో 5 గిద్దల బియ్యము వడి గంటు గిన్నె, కంద పిలక, ఆకులు 3, వక్కలు 2 ఉంచి, ముడి పెట్టి పెండ్లి పెట్టెలో సర్దవలెను. మగ పెండ్లి కుమారుని కండువాలో కంద పిలక అవసరంలేదు.
తలంబ్రాల బియ్యము 21/2 శేర్లు:
పెండ్లిపనులు మొదలు పెట్టిన రోజు కొట్టిన పసుపు, పెండ్లి కుమారుని చేసినప్పుడు కొట్టిన పసుపు, కొద్దిగ ఆవునెయ్యి, మంచి ముత్యములు 3, బియ్యములో వేసి 5గురు ముత్తైదువులు కూర్చొని కలపవలెను. ఈ బియ్యము పెండ్లి పెట్టెలో పెట్టుకొనవలెను.
మంగళ సూత్రము తీసుకురావటము:
మేళముతో కంసాలి వద్దకు వెళ్ళాలి. ఒక పళ్ళెములో జాకెటు ముక్క, పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరిచిప్ప, ఆకులు, పండ్లు 6, కంసాలికి దక్షిణ ఇవ్వవలెను. ఆడవాళ్ళు, మగవాళ్ళు వెళ్ళవచ్చును. కంసాలి సూత్రమునకు పూజచేసి ఇచ్చును. పెండ్లిపెట్టెలో సర్దుకొనవలెను. మంగళసూత్రము తెచ్చిన తరువాత ఇంటిలో నిదురచేయరాదు. కావున పెండ్లి రోజుననే తీసుకురావలెను.
