పలికెడిది భాగవతమఁట

పలికెడిది భాగవతమఁట

bookmark

"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగు నఁట
పలికెద వేఱొండు గాథ బలుకఁగనేలా.

భావము:
మహాభక్తుడైన పోతన సర్వం దైవాయక్తంగా భావిస్తూ భాగవత గ్రంథ కర్త్తుత్వానికి కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణే అధికారిగా నిల్పుతూ చెప్పిన పద్యం ఇది.
చెప్పే గ్రంథమేమో భాగవతం - అంటే భక్తుల చరిత్రమూ, ఆ భక్తులకు కుదురైన శ్రీ హరి చరిత్రమూ. మరి ఆ శ్రీ హరిలీలలు అనంతాలు కదా, అవి వర్ణించడానికి ఎవరికి సాధ్యం? అందుకే పలికించే విభుడు ఆ రామ భద్రుడే! అంటూ వ్యక్తం చేశాడు పోతన. ""పలికించు విభుండు రామభద్రుండట"" అంటూ చెప్పి పోతన శ్రీ రామచంద్రునికి ""విభు"" శబ్దంతో జగన్నాయకత్వాన్నీ, ""భద్ర"" పదంలో లోక రక్షకత్వాన్నీ సంక్రమింపజేస్తూ రామచంద్రుడు సాక్షాత్తు శ్రీ హరే సుమా అంటూ తెలియజేసినాడు. 

అప్పుడు పలికించే ప్రభువు శ్రీ హరికాగా పలికేది శ్రీహరిచరితం అంటే భాగవతం ఐంది. ఇంతకంటే పుణ్యం కానీ, పుణ్య వస్తు సంకీర్తనం కానీ ఇంకేముంటుంది? ఇటువంటి కథను పలకడం వల్ల ఏమిటీ లాభం? అంటే భవహరం, ఇక జన్మ లేకపోవడం. అందుకే పోతన వేరే కథను చెప్పడం ఎందుకూ? సంసార బంధాలు సమసిపోయే ఈ హరికథనే చెబుతానంటూ భాగవతాన్ని ప్రారంభం చేశాడు. 
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను."