నిద్రలలో పాన్పు వేయుట

నిద్రలలో పాన్పు వేయుట

bookmark

సాయంత్రము 7గంటల సమయములో పేరంటముగా చేయుదురు. పరుపు మీద మంచి దుప్పటి వేసి పెండ్లికుమారుడు తూర్పు చూచునట్లుగా, ఎదురుగా పెండ్లికుమార్తెను తాంబూలము ఇచ్చి కూర్చొన పెట్టవలెను. పూలమాల బంతిలా చుట్టి చేండ్లాట ఆడించవలెను. తాంబూలముతో, బంగారు గొలుసుతో, దూరముగా కూర్చొని ఒకరిచేతి నుంచి ఒకరు వేసికొందురు. తరువాత సరి, బేసి ఆడించవలెను. 2, 4, 6, 8, 10, 12 ఇవి సరి. 1, 3, 5, 7, 9, 11 ఇవి బేసి. రూపాయి బిళ్ళలు కాని, వక్కలు కాని ఒక్కొక్కరికి 100 ఇవ్వవచ్చును. గుప్పెడులోని నాణెములు పట్టుకుని గుప్పెడు మూసి సరా, బేసా అని అడుగవలెను. రైటు చెప్పిన వీళ్ళకు వచ్చును, తప్పు చెప్పిన ఎన్ని అయితే వున్నవో అన్ని ఆడినవాళ్ళకు ఇవ్వవలెను. ఖాళిచెయ్యి పెట్టినచో పుట్టి అందురు, దానికి 30 బిళ్ళలు ఇచ్చుకోవాలి.

అబ్బాయి అమ్మాయికి ఎడమచేతితో బొట్టు పెట్టవలెను. అమ్మాయి చేత అబ్బాయికి కుడిచేతితో బొట్టు పెట్టించెదరు. అబ్బాయి చేత అమ్మాయికి గంధము పూయించెదరు. అమ్మాయి చేత అబ్బాయి చేతులకి గంధము పూయించెదరు. పన్నీరుకాని స్ప్రేకాని ఒకరిపై ఒకరు చల్లుకొందురు. ఒక అరటిపండు వలిచి అబ్బాయి తినిన తరువాత అమ్మాయిని తినమందురు. అలాగే స్వీటు, బాదంపప్పు, జీడిపప్పు, ఒక్కసారే ఇద్దరు కొరుక్కునమందురు. సరదాగా బాగా గోల చేయుదురు.

అల్లుడుగారికి చాక్లెట్లు, బిస్కెట్లు, దండతో అలంకరించి టోపి పెట్టవచ్చును. ఇలా ఎవరికి తెలిసిన సరదాలు వారు చేసుకొనవచ్చును. మంగళహారతి పాడి హారతి అద్దవలెను. వరసపాటలు కూడ పాడుకొనవచ్చును.

3 లేక 5గురు దంపతులకు కొత్త దంపతులచేత తాంబూలములు ఇప్పించవలెను. 2 పండ్లు, ఆకులు, వక్క, దక్షిణ పెట్టి కొత్తదంపతులు ఇద్దరు పట్టుకుని ఇవ్వవలెను. తాంబూలము తీసుకొను దంపతులలో మగవారి కండువాకు ఆడువారి చీరకు ముడిపెట్టి భుజము మీద చేయివేసి తాంబూలము తీసుకొనవలెను. ఆఖరుగా కొత్తదంపతులచేత పేర్లు చెప్పించి లేవమందురు. వున్న అతిధులకు బొట్టు, పసుపు, పండు తాంబూలము ఇచ్చి పంపవలెను.