అలసులు, మందబుద్ధియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
"అలసులు, మందబుద్ధియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
భావము:
మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు."
