శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణహస్తని

శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణహస్తని

bookmark

"శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణహస్తని
ర్మూలికి, ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా
పాలికి, వర్ణధర్మ పరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్రనిరుద్ధ మరీచిమాలికిన్.

భావము:
శ్రీకృష్ణుని మహోన్నతగుణాలను మరింతగా కొనియాడుతూ మురిసి పోతున్నాడు భక్తశిఖామణి పోతన. 
అందరూ ఆయన మానినీచిత్తచోరుడంటారు కానీ నిజానికి ఆతడు గొప్ప శీలసంపద కలవాడు. లోకాలన్నిటినీ చక్కగా నడిపించే నీతితో అలరారేవాడు. త్రిశూలాన్ని ధరించిన శ్రీమహాశివుని తనగుండెగుడిలో నిలుపుకొన్న మహాత్ముడు. బాణాసురుని వేయిచేతులనూ విలాసంగా ముక్కలుగా గొట్టిన మహాబలశాలి. చాలా ఉద్ధృతంగా విజృంభించిన రాల వానతో దెబ్బతిన్న గొల్లల నందరినీ భద్రంగా కాపాడిన కృపామూర్తి. వర్ణధర్మాలను కాపాడి లోకాన్ని ఒకత్రాటిమీదన నడిపించే దిట్ట. జంట మద్దిచెట్లను పసితనంలోనే కదిలించి కుదిలించి కూల్చినప్రోడ. నిరంతరం పూమాలలను ధరించి వానికి వన్నెతెచ్చిన అందగాడు. తనచక్రంతో సూర్యుని కిరణాలప్రసారాన్ని అడ్డగించిన సర్వేశ్వరుడు. అతనికి అంకితంగా నా భాగవత మహారచనను ప్రారంభిస్తున్నాను. 
శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి."