పరమ ధర్మము

పరమ ధర్మము

bookmark

"పరమ ధర్మము:

పార్వతీదేవి "" నాధా ! ధర్మములలో పరమ ధర్మము ఏది ? "" అని అడిగింది. పరమశివుడు "" అహింస అన్ని ధర్మములలో ఉత్తమ ధర్మము "" అన్నాడు శివుడు. పార్వతీదేవి "" నాధా ! హింస చెయ్యకుండా మానవులు జీవించడం అసాధ్యము కదా ! మరి అహింసను ఎలా ఆచరించగలరు వివరించండి "" అని అడిగింది. పరమశివుడు "" పార్వతీ ! నీ వన్నది నిజమే. నేలమీద పాకేచీమలు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, దోమలు, నల్లులు, క్రిమి కీటకాదులను చంపకుండా మనిషి బ్రతకలేడు. కాని ఆహారము కొరకు జీవహింస చేయడం పాపము. ఫలములు, కాయలు, ఆకులు తిని బ్రతకవచ్చు కదా ! పాలుత్రాగి బ్రతుక వచ్చు కదా ! ఇంద్రియనిగ్రహముతో జీవించిన వారు మహాత్ములు ఔతారు. కనుక అహింసను పాటించుట కష్టము కాదు.

అహింస

          అహింస   అనేది వేరు విధముగా చెప్ప వచ్చు. చావు పుట్టుకలు ప్రాణులధర్మము. దానిని ఎవరూ తప్పించ లేరు. ఒకడు పెట్టిన దీపములో శలభములు పడి మర్సణించిన ఆ పాపము దీపము పెట్టిన వాడికి అంటదు. రైతు పొలము దున్నే సమయంలో నాగటిచాలులో పడి అనేక జీవులు చచ్చిపోతుంటాయి. ఆ పాపము దున్నేవాడికి అంటదు కదా ! మానవులు తమతమ దైనందిన పనులు చేసుకుంటుంటే ఆయువు తీరిన ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి. ఆ పాపపములు ఆయా మానవులకు అంటదు. ఆ ప్రాణులను తామే చంపామని అనుకోవడం మూర్ఖత్వమే ఔతుంది. పుణ్యకార్యములకు కాని పాపకార్యములకు కాని బుద్ధిముఖ్యము. ఏ పని అయినా బుద్ధి పూర్వకంగా చేస్తేనే ఆ ఫలము పనిచేసిన వాడికి సంక్రమిస్తుంది. ఈ సందర్భంలో నీకు ఒక విషయం చెప్తాను. తమకుచావు మూడిన గోవులు రంతిదేవుడు వద్దకు వెళ్ళి రంతి దేవుడు చేసే యజ్ఞములో ఆహుతి అయ్యాయి. ఆ గోవులను చంపిన రక్తము చర్మణ్వతి అనే నదిగా ప్రవహిస్తుంది. ఆ నదిలో స్నానము చేసిన వారు పాపములు నశించి పుణ్యాత్ములు ఔతారు. ఆ యజ్ఞములో చనిపోయిన గోవులన్నీ ఉత్తమలోకాలకు పోయాయి కనుక ఆ గోవులను చంపిన పాపము రంతిదేవుడికి అంట లేదు.

క్షత్రియులు హింస

         యుద్ధములో ఇరుపక్షాలు ఒకరిని ఒకరు నరుక్కుంటారు. కాని యుద్ధములో చచ్చిన వాళ్ళు స్వర్గానికిపోతారు. కనుక వాటిని హింస అని చెప్పడానికి వీలు కాదు. రాజుకు వేటకు పోవడం జంతువులను వేటాడడం రాజధర్మము. క్రూరమృగములను పంట పొలమును నాశనం చేస్తాయి. మానవులను చంపి వారికి హానిచేస్తాయి. రాజు వేటలో ఆ క్రూరమృగములను చంపినందువలన అతడికి పాపము అంటదు. రాజుచేతిలో చచ్చిన మృగములకు పుణ్య లోకములు ప్రాప్తిస్తాయి. రాజు దండించతగిన వారిని విడిచిపెట్టినా దండించ తగని వారినిదండించినా, తప్పుచేయని వాడికి శిక్షవిధించినా, బ్రాహ్మణులను హింసించినా రాజు హింస చేసినట్లే. నహుషుడు బ్రాహ్మణులను హింసించి శాపోహహతుడైనాదు. అలాగే ఇంద్రుడు గౌతముడికి అపకారము చేసి శాపం పొందాడు. కనుక రాజైనవాడు బ్రాహ్మణులకు అపకారం చెయ్యకుండా రాజ్యపాలన చెయ్యాలి. అప్పుడే అతడికి సకల శుభములు కలుగుతాయి.  అని అన్నాడు శంకరుడు."