ఏది మరణము, మరణము అంటే ఏమిటి
ఏది మరణము, మరణము అంటే ఏమిటి.:
మరణమంటే ప్రాణోత్క్రమణము, దేహత్యాగము ఇది బహ్యార్ధము. ఆద్యాత్మికార్ధములో భగవత్ ధ్యానము,భగవత్ చింతన చేయని ప్రతి సెకను మరణమే. అంటే మనము రోజుకు ఎన్ని సార్లు మరణిస్తున్నామో, బ్రతుకుతున్నామో కదా? కొంతమంది బ్రతికుండీ మరణిచిన వారితో సమానమే కదా?. బాగా ఆలోచించండి.
చనిపోయే ముందు జీవుని స్తితి ఎలా ఉంటుంది
బాల్యది అవాస్తలయందు సుకృత ఫలాలను అనుభవించిన పిమ్మట వార్ధక్యములో దుష్కృత్యాలకు ఫలంగా ఒకానొక వ్యాధి పుడుతుంది. నరుణ్ణి బలమైన కాలము ఉడుపువేసుకొని మ్రింగుతుంది. మరణ కాలము దగ్గరపడే టప్పటికి (పాపకర్ములు) హేయత్తమైన బుద్ధి లేకపోవడంతో పుత్రకళాదులచేత పోషింపబడుచూ, ఈసడించుకొంటూ పెట్టిన అన్నము మొ|| వాటిని సిగ్గువిడచి కుక్కలా తింటుంటారు. మరి రోగి, మందాగ్నితో అల్పాహారుడు, అల్పగతి, ప్రాణము పోయే సమయానికి వివహిత నేత్రుడు కావడం వలన శ్లేశ్మముచేత బంధించబడిన నాడుల చేత శ్వాసకోసములచే ఆయాసముతో, కంఠము నుండి గురక ప్రారంభమవుతుంది. బంధువులు పుత్ర పౌత్రులు పిలిచినా కాలపాశబద్ధుడు కావడం వలన ఆ మరణ సమయములో పలులేక దిక్కులేనివాడి వలె దిక్కులు చూచుచుంటాడు.
అలాంటి మానవుడు కుటుంబ వ్యవహారములపై అమితమైన ఇస్ట్టము కలిగి ఉండడము వలన ఇంద్రియ నిగ్రహమును కోల్పోయి ఉంటాడు. మరణకాలములో నస్టమతుడౌతాడు. మరణ కాలము దగ్గర పడేకొద్దీ ఇంద్రియ నిగ్రహము లేకపోవడమూ,వివహిత నేత్రుడు కావడమూ,శ్లేశ్మము వలన నాడులు బంధింపబడదమూ,కాలాపాశములచేత బంధింపబడడమూ, ఇత్యాది కారణములవలన జీవునకు దివ్యదృష్టి కలుగుతుంది, అందువలన ప్రపంచమంతా కరతలామలకమై ఉంటుంది. అందువలన అంత్యకాలములో మనిషి పలుకలేడు. కళ్ళతో చూడడమెకానీ మాటరాదు. సర్వేంద్రియాలు ఇలా వికలత కావడము వలన చైతన్యము లుప్తమైపోతుంది.
యమభటులు సమీపములో నిలబడినపుడు భయబ్రాంతుల వలన మూత్రవిసర్జనము మరియు మలవిసర్జనమూ రెండూ ఏకకాలం లో జరుగుతాయి. చర్మములోని శ్వేద రంధ్రముల ద్వారా వేపరీతమైన చమటలు వస్తాయి. యమభటులు సమీపములో నిలబడి ప్రాణాలను ఒక్కొక్క స్తానమునుండి తీయడం ప్రారంభిస్తారు చివరగా శ్వాస స్తానమునుండి జీవుడు చలించిన సమయములో (చివరి ప్రాణము పోవునప్పుడు) జీవునికి తల్పములాగా ఉండి ఈ శరీరమును వేయి తేళ్ళు ఒక్కసారి కుట్టిన ఎలా ఉంటుందో అలాంటిబాధను ఈ శరీరం అనుభవిస్తుంది. పాపాత్ముల ప్రాణములు అధో మార్గమునుండి వెళ్లిపోతాయి.
జీవుడు అంగుష్ట మాత్రమే ఉంటాడు. ఈ స్థూలశరీరము నుండి హాహా కారములతో వెలువడుతూ యమ బటులు యాతనా దేహాన్ని బంధించి బలాత్కారంగా కంఠానికి యమపాశాన్ని తగిలించినపుడు జీవుడు ఈ శరీరము నుండి శ్లేశ్మను వెలువడిస్తూ ఉంటుంది. చొంగ కార్చుకుంటూ ఉంటాడు. పాపాత్ముల యొక్క ప్రాణవాయువులు అధో మార్గము నుండి వెళ్ళేటప్పుడు మలమూత్ర విసర్జనము ఒక్కసారిగా బయటకు వెళతాయి.
ఈ శరీరమునుండి జీవుడు విడిపోయేటప్పుడు, ఈ శరీరము చాలా బాధలను అనుభవిస్తుంది. వేయి తేళ్ళు ఒక్కసారిగా ఈ శరీరాన్ని కుట్టితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధగా ఉంటుంది. అందుకే నృసింహ శతక కర్త శ్రీ శేషప్ప కవిగారు తన నృసింహ శతకములో “బ్రతికినన్నాళ్ళు నీ- భజన తప్పనుగాని, మరణకాలమందు మఱుతునేమో ఆవేళ యమదూత - లాగ్రహంబున వచ్చి,ప్రాణముల్ పెకలించి – పట్టునపుడు, కఫవాత పైత్యముల్ – గప్పగాభ్రమచేత గంపముద్భవమంతి – కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను – నారాయణ యంచు, బిలుతునో శ్రమచేత బిలువలేనొ!, నాటికిప్పుడే భక్తి నీ – నామ భజన, తలచెదను జెవిని వినవయ్య – ధైర్యముగను, భూషణ వికాస! శ్రీ ధర్మ – పుర నివాస!, దుష్టసంహార! నరసింహ! దురితదూర!” ప్రాణోత్క్రమణ సమయములో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, గొంతులో నుండి మాటలు రావు కేవలం మననం మాత్రమే సాధ్యం. ఆ పరిస్థితులలో మనము భాగవన్నామము చేయలేము. కనుకనే ఇప్పటినుండి సాధన నిత్య పూజ, జపము, తపము అవసరము.
మన జాతిపిత మహాత్మా గాంధీగారు తనను ఒక ధూర్తుడు తుపాకీటో కాల్చినపుడు “హేరామ్, హేరామ్, హేరామ్” అనగలిగారు అంటే ఎంతసాధన, ఎంతపూజ, ఎంత ధర్మవర్తన ఉంటే అది సాధ్యం.
అoత్యేష్ఠి సంస్కారాములు:
ఈ మానవ ఉపాధి పడిపోయిన (మరణించిన) తరువాత జరిగే ప్రక్రియ ఏమిటి? గరుడ పురాణం దీనిని గురించి ఏమీ చెబుతోoది? ఆ కర్మ తంతు ఎవరు జరుపవలయును? ఎలా జరుపవలయును? ఎవరి ఇంటిలో నైనా వయోవృద్దులు, అనారోగ్యవంతులు ఉండిన ఇక వీరికి ప్రాణోత్క్రమణము అవుతుంది (చనిపోతారు) అని అనిపించినపుడు. ప్రతి గృహస్తు ఈ క్రింది మూడింటిని తప్పని సరిగా అందుబాటులో ఉంచుకోవల యును.
1. శివ ప్రసాదము
2. విష్ణు ప్రసాదము
3. గంగ
శివ ప్రసాదమును, లలాటము యందు, బ్రహ్మరంధ్రముపైన, అత్యంత శ్రద్ధా భక్తులతో ఉంచవలయును.
విష్ణు ప్రసాదమును నోటిలో వేయవలయును.
గంగా మతాను కొద్ది కొద్దిగా నోటిలో వదల వలయును.
ఈ సమయమున ఇంటి బ్రహ్మకు గానీ, సద్భ్రాహ్మణునకు గానీ, వేద పండితునకు గాని, గోదానము చేసిన అత్యంత శ్రేష్ఠము. అలా గోదానము చేసి ప్రాణోత్క్రమణము జరిగిన (చనిపోయిన) తరువాత ఆ జీవుని పరదేవత(ఆవు) అనుగ్రహించి తనతో తీసుకుని వెళుతుంది.
జీవుడు శరీరం విడిచి పెట్టినా కొంత మంది దేవతల శరీరము ఆవహించి ఉంటారు.
ఉదా:- అరచేతియందు ఇంద్రుడు, నోటియందు అగ్ని, కళ్ళయందు సూర్యుడు, చెవులయందు వాయివు ఇలా ఆవహించి ఉంటారు. ప్రత్యేకించి దశ వాయువులలో ఒకటైన వ్యాన వాయువు శరీరమును ఆవహించి ఉంటుంది. అది తనూభవుడు చేయు కర్మకొరకు ఉంటుంది.
ఈ ఆవహించి యున్న దేవతలను సమంత్రక హోమము(శాంతి హోమము) చేసిన తరువాత ఈశ్వరునికి సమర్పించాలి.
ఈ క్రమములో మంత్రము మంత్రశక్తి, చిరునామా లాంటిది. తర్వాత విభూత్యాది అలంకారములు (శరీరమునకు) చేసి అప్పుడు ప్రేతత్వము నుండి విముక్తి కలిగించాలి. ఈ సమయంలో జీవుడు దీర్ఘమూర్ఛయందు ఉంటాడు. జీవుడు మరొక దేహము నాశ్రయించడమో లేదా మరొక జన్మకు వెళ్లడమో లేదా జీవన్మక్తుడు కావడమో, జరగడానికి కర్త (తూభవుడు) మంత్రము చెప్పి పంపించాలి.
కాలి వ్రేళ్లను రెండు బ్రోటన వ్రేళ్లను మరియు రెండు చేతుల బ్రోటన వ్రేళ్లను కలిపి గుడ్డ పేలికతో కానీ, లేదా పంచ/చీర అంచు తో కానీ కట్టేస్తారు ఎందుకు?
ఈ దేహాభిమానంతో, బంధుప్రీతితో, సంసార బంధములతో, సంపాదార్జ నతో, యజ్ఞ యగాది క్రతువులతో,పురాణ పఠన శ్రావణాలతో, ప్రవచనా శ్రవణములతో, ఇంత కాలం ఈ దేహాన్ని (శరీరాన్ని) ఆశ్రయించి దేశకాల పరిస్థితులను బట్టి నిలకడ లేకుండా, తీరికలేక, అలయక, సొలయక ఇంతకాలము తిరిగావు. ఇక ఈ దేహము తిరగదు పడిపోయిందని బట్టలు నీకు ఉపయోగపడవు అని ఆ బట్టల అంచు పీలికతో కట్టుతారు.
శవ వాహకులు బేసి సంఖ్యలో ఉండాలి.
బ్రతికినంతకాలము తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో పాపకార్యములు చేసి ఉంటారు, కాబట్టి గోసంబంధమైన పంచ గవ్య ప్రాసనము చేయిస్తారు. ఆ పంచ గవ్యములను ఒంటి నిండా అలిమి (అలరి,పూసి) ఆవు నేతిని శరీరము పైన నోటి నిండా పోయాలి. దీనిని హోమ ప్రక్రియ అంటారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు తెలియని వారు అందరూ దారి బత్యము ఇవ్వాలి. అనగా నామ బియ్యము అంటారు. పచ్చి బియ్యమును మృతదేహము నోటిలో వేయాలి. కర్త( తనూభవుడు) నోరు తెరచి నోటి నిండా( నోటిని) ఆవు నెయ్యితో నింపాలి. అందులో కొద్దిగా బంగారము ముక్క, వెండి ముక్కను ఉంచాలి. జీవుడు (ఆత్మ) ఈ ప్రక్రియలు అన్నీ చూస్తూ ఉంటారు. చూచేటప్పుడు ప్రయాణము చేసేటప్పుడు, భైరవయాతనను అనుభవిస్తాడు. చిమ్మ చీకటిలో భయంకరమైన కుక్కలు తరుముతాయి. అప్పుడు భోరు భోరున విలపిస్తాడు. ఎందుకంటే నేను ఈ ఉపాధిని ఆశ్రయించి ఉన్నంత కాలము, నా వారు, నాది, నా బిడ్డలు, నా భార్య అని ఎంతకాలం వృధాచేశాను. ధనార్జనాతో, తృప్తిలేని జీవితం, ధనార్జన కోసం రాత్రిబవళ్ళు వేసరక, తిరిగితినే కానీ, ఒక్క నాడైనా భగవంతుని మీద ధ్యాస, భగవన్నామము తెలియని మూర్ఖుడ నైనాను, అని ఏడుస్తాడు. మనకు ఇప్పుడు తెలియకపోయినా అప్పుడు తప్పకుండా తెలుస్తుంది. తెలిసి కూడా, కళ్ళారా చూచి కూడా ఏమి చేయలేని పరిస్థితి అవుతుంది. మరలా మనకు మానవ జన్మ దుర్లభము కదా.
ఈ శరీరము చనిపోయిన తర్వాత:-
1. చనిపోయినది మొదలు 10 రోజుల వరకు పుత్రుడు పిండ ప్రదానము చేస్తాడు. ఆ ప్రేత పిండమును నాలుగు భాగములుగా విభజింపబడు తుంది. అందులో రెండు భాగములు యాతనా శరీర వృద్దికి, మూడవ భాగం యమదూ తలకు, నాల్గవ భాగమును మరణించిన ప్రేతము భుజిస్తుంది.
2. మరణించిన రోజు మొదలు 9 రోజుల వరకు పెట్టబడే ప్రేతపిండము వలన జీవునికి చేతడు పిండ దేహం కలుగుతుంది.
3. పదవ నాటి పిండము వలన పిండ దేహానికి బలము కలిగి నడవడానికి శక్తి వస్తుంది.
4. జీవుడు ఆ పిండ దేహముతోనే చేసిన పాప కర్మలకు ఫలితములను అనుభవిస్తాడు.
పిండదేహాభివృద్ధి:-
1. .......మొదటి రోజు ఇచ్చిన పిండము వలన శిరస్సు
2. .......రెండవ రోజు ఇచ్చిన పిండము వలన కంఠము, భుజాలు
3. .......మూడవ రోజు ఇచ్చిన పిండము వలన హృదయం
4. .......నాల్గవ రోజు ఇచ్చిన పిండము వలన పృష్టము
5. .......ఐదవ రోజు ఇచ్చిన పిండము వలన బొడ్డు
6. .......ఆరవ రోజు ఇచ్చిన పిండము వలన మెల , గుహిప్రదేశము
7. .......ఏడవ రోజు ఇచ్చిన పిండము వలన తొడలు
8. .......ఎనిమిదవ రోజు ఇచ్చిన పిండము వలన పిక్కలు
9. .......తొమ్మిదవ రోజు ఇచ్చిన పిండము వలన పాదాలు
10. పదవ రోజు ఇచ్చిన పిండము వలన ఆకలి, దప్పికలు అలాంటి పిండ దేహాన్ని ఆశ్రయించిన జీవుడు ఆకలి, దాహములతో బాధ పడుచుంటాడు.
11,12 ఏకాదశి, ద్వాదశి దినములయందు కొడుకు చే ఈయబడిన పిండమును జీవుడు భుజిస్తాడు.
13వ రోజు పాశబద్దుడై కట్టబడిన కోతి వలె యమభటుల వెంట దుర్గమమైన యమ మార్గములో బయలుదేరుతాడు.
ఆ తర్వాత పిండదేహముతో జీవుడు భూలోకము నుండి యమ లోకమునకు ప్రయాణము చేస్తాడు. యమ భటులుతో వారి హింసలను భరిస్తూ ప్రయాణం చేస్తాడు.
భూలోకానికి యమలోకం 86 ఆమడలు దూరం ఉంటుంది. వైతరణీ నది వైశాల్యము కాకుండా 86 ఆమడల దూరం, ఆ మార్గములో జీవుడు ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజుకు 247 ఆమడల దూరం నడుస్తాడు.ఆ విధముగా జీవుడు సౌంయపురం చేరుతాడు.
సౌరిపురము, నాగేంద్రభవనము, గంధర్వనగరము, శైలాగనుపురము, క్రౌంచపురము, క్రూరపురము,విచిత్రభవనము, బహ్వపదపురము, దుఃఖపురము, నానాక్రందపురము, సుతప్తభవనము, రౌద్రపురము,పయోవర్షణపురము, సీతాఢ్యపురము, బహుభీతి పురము అనే 16 పురములు 16 పట్టణాలను దాటి ఏడుస్తూ స్వగృహమును వదలి చిట్ట చివరకు యమపురం చేరుతాడు.
