అహోబిలం
"రాయలసీమ లోని పుణ్యక్షేత్రము అహోబిలం:
అది పుడమి తల్లి అందాలన్నీ పొత్తిళ్లలో పొదివి పట్టుకున్న రాయలసీమ, ఇక్కడ కొండ కోనలుంటాయి జాలువారే జలపాతాలుంటాయి, వయ్యారంగా నడిచి వెళ్లే నడక నేర్చిన నదులుంటాయి. శిధిలాలను ముద్రించుకున్న చారిత్రక ఆధారాలుంటాయి. చిరకాలం నిలిచిపోయే శిలాశాసనాలుంటాయి. ఇందులొ ఎన్నో పుణ్యక్షేత్రాలు ...
అట్టి పుణ్యక్షేత్రలలో ఒకటి
అహోబిలం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం.
ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.
అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు.
నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించినాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది.
ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది.
అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి.
పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం.
దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు.
ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్టించి ఆరాధించినాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం కలదు.
ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు.
ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు.
వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు.
పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు.
వసతి సౌకర్యాలు
అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు.
వసతి కోసం మూడు అవకాశములు ఉన్నవి.
• తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిధి గృహములో ఉండవచ్చు
• లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.
• దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు.
• ఇక్కడ ఆంథ్ర ప్రదేశ్ ప్రభుత్వ టూరిజం వారి భోజన హోటల్ కలదు.
చేరుకొను విధము
• రోడ్డు మార్గము: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.
• రైలు మార్గము:అహోబిలం దగ్గరలోని రైలు సముదాయము నంద్యాల
• విమాన మార్గము:
అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం హైదరాబాదు, అక్కడనుండి మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు."
