అరుణాచలం

అరుణాచలం

bookmark

"అరుణాచలం:

అరుణాచలం అనగానే అరుణాచలేశ్వరుడు గుర్తుకువచ్చి మనసు భక్తిభావంతో పొంగిపోతుంది. గిరి ప్రదక్షిణం ఆధ్యాత్మిక లోకాలలో ఓలలాడిస్తుంది. అక్కడి కార్తీకదీపోత్సవం అణువణువునూ శివతేజస్సుతో నింపి భక్తులను పులకింపజేస్తుంది. అరుణాచలం అనగానే రమణమహర్షి ఆశ్రమమూ గుర్తుకువస్తుంది. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం సమాధి మనసులో మెదులుతుంది. అరణాచలం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

అరుణాచలం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులను అవ్యక్త అనుభూతులకు లోనుచేసే దివ్యక్షేత్రం. శివభక్తుల పుణ్యక్షేత్రం. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపములు హరించునది అనే అర్థం కూడా ఉంది. తమిళంలో ‘తిరువణ్ణామలై’ అంటారు. తిరు అనగా ‘శ్రీ’ అని, ‘అణ్ణామలై’ అనగా పెద్దకొండ అని అర్థం. ఇక్కడి శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందన్నది భక్తుల నమ్మకం. వేదాలు, పురాణాలలో కూడా అరుణాచలం ప్రస్తావన విశిష్టంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వరకాండలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించారు. అరుణాచలేశ్వరుడి దేవాలయం విశ్వకర్మ చేత నిర్మితమైందని పురాణాలు చెబుతాయి. తిరువణ్ణామలైని పల్లవులు, చోళులు, హోయసలలు, విజయనగరరాజులు, కర్నాటిక్‌ కింగ్‌డమ్‌, టిప్పుసులాన్‌, ఆ తర్వాత బ్రిటిషర్లు పాలించారు.

తిరువణ్ణామలైలో:
హైదరాబాద్‌ నుంచి అరుణాచలానికి దూరం 821 కిలోమీటర్లు. అరుణాచలం తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉంది. ఇది మద్రాసుకు 180 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం అరుణాచలం కొండ దగ్గర ఉంది. అరుణాచలం కొండను ‘అరుణగిరి’, ‘అన్నామలై కొండ’, ‘అరుణాచలం’, ‘అరుణై’, ‘సోనాగిరి’, ‘సోనాంచలం’ అని కూడా పిలుస్తారు. గర్భగుడిలో పరమపవిత్రమైన అరుణాచలేశ్వరుడిని చూడొచ్చు. ఈ స్వయంభూలింగం దక్షిణాదిలోని ఐదు ముఖ్య శివక్షేత్రములలో ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ కొండపై కార్తీక దీపాలు వెలిగిస్తారు.

ఈ దేవాలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే దీనికి చాలా గోపురాలు ఉంటాయి. కొన్ని గోపురాలైతే 66 మీటర్ల ఎత్తు వరకూ కూడా ఉన్నాయి. తూర్పు ఉన్న గోపురాన్ని రాజగోపురం అంటారు. ఇదే దేవాలయంలోని అన్ని గోపురాల్లోకెల్లా పెద్దది. ఇది తూర్పున ఉంది. దక్షిణాన ఉన్న గోపురాన్ని తిరుమన్జాన్‌ గోపురం అంటారు. పశ్చిమాన ఉన్న గోపురాన్ని పైగోపురం అంటారు. ఉత్తరం వైపున్న గోపురాన్ని అమ్మణ్ణి అమ్మ గోపురం అని పిలుస్తారు. దేవాలయ కుడ్యాలు అద్భుతమైన శిల్పకళాసంపదతో నిండి వీక్షకులను కళ్లార్పనీయవు.

అరుణాచలేశ్వరుడి పరమభక్తుడైన శ్రీరమణమహర్షి ఇక్కడి వారే. ఆయనే కాదు ఎందరో మునులు, యోగులు అరుణాచలం బాట పట్టారు. వారిలో శివభక్తులైన మనిక్కవాచాగార్‌, అప్పార్‌, సాంబందార్‌, సుందరార్‌ వంటి వారు ఉన్నారు. ఈ కొండే శివుడని పురాణాలు చెపుతున్నాయి. అందుకే అరుణాచలేశ్వర దేవాలయం కన్నా ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. దీన్ని జ్యోతిర్లింగమని చెపుతారు. ఇది తేజోలింగము కనుక అగ్నిక్షేత్రమని కూడా అంటారు. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగక్షేత్రముల్లో దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకగా పేర్కొంటారు. అన్నామలైశ్వరుడిని అగ్నిలింగ మని అంటారు. ఇక అరుణాచలేశ్వరాలయం చాలా పెద్దది. ఈ దేవాలయానికున్న ఒక్కొక్క రాజగోపురం చూస్తుంటే పోటీపడి మరీ కట్టారా అని అనిపిస్తుంది. నాలుగు దిక్కులు నాలుగు రాజగోపురములు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తం ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఉంది. భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటి.

జ్యోతిర్లింగ స్వరూపం:
ఈ దేవాలయ ప్రాంగణంలో అన్నామలైయార్‌, ఉన్నాములై అమ్మాన్‌లతోబాటుగా ఎన్నో గుడులున్నాయి. విశాలమైన మండపాలు ఉన్నాయి. వాటిల్లో వెయ్యి స్థంభాల మండపం కూడా ఉంది. దీన్ని విజయనగర రాజుల కాలంలో కట్టించారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపమే కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్లు భక్తులు భావిస్తారు. అగ్నిలింగం రమణాశ్రమానికి వెళ్లే దారిలో కనిపిస్తుంది. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రమణాశ్రమానికి ముందు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రిస్వామి సమాధి కూడా అక్కడే ఉంది.

గిరి ప్రదక్షిణం:
ఇక్కడ చేసే కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా ఉంటుంది. కార్తీక మాసంలో దీన్ని చేస్తారు. నవంబరు డిసెంబరులలో పున్నమి రోజున ఈ ఉత్సవం చేస్తారు. కొండపైన పెద్ద దీపం వెలిగిస్తారు. ఈ దీపం ఎన్నో మైళ్ల దూరం కనిపిస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే అగ్నిశివలింగం ఆకాశంతో మమేకమైనట్టు అనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని లక్షల మంది భక్తులు ఆనందపారవశ్యంతో తిలకిస్తారు. నిండు పున్నమి రోజున భక్తులు గిరిప్రదక్షిణం చేస్తారు. గిరప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గిరిప్రదక్షిణాన్నే ‘గిరివాలం’ అని కూడా అంటారు.

గిరివాలం చేయడం వల్ల భక్తులు పాప విముక్తులవుతారని, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలాన్ని తలచుకుంటే చాలు అన్ని బంధనాలు తెంచుకుని స్వేచ్ఛాజీవులమవుతామని కూడా భక్తుల విశ్వాసం. భగవాన్‌ రమణమహర్షి అరుణాచలాన్ని భూహృదయం (హార్ట్‌ ఆఫ్‌ ఎర్‌ ్త)గా అభివర్ణించారు. స్కందపురాణంలో అన్నింటికన్నా ఎంతో గొప్ప పుణ్యక్షేత్రంగా దీన్ని పేర్కొన్నారు. అరుణాచలేశ్వరుడితోపాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువణ్ణామలై శాశ్వతమైన శాంతినొసగే ప్రదేశంగా పేరు పొందింది. ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ గుడిలో శివుడు అగ్నిలింగాకారంలో ఉంటాడు.

పచ్చని ప్రకృతి మధ్య:
ఈ అరుణాచలం కొండ ఎత్తు 2,669 అడుగులు. కొండ చుట్టూతా రోడ్డు ఉంటుంది. ఆ ప్రదేశం కూడా పచ్చటి చెట్లతో, చుట్టూరా కొండలతో అణువణువునా అందాలు చిందిస్తుంటాయి. అక్కడి ప్రకృతి అందాలు మనల్ని కళ్లు తిప్పుకోనీయవు. అరుణాచలం కొండ కృతయుగంలో అగ్ని కొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపరయుగంలో తామ్ర కొండ అని, కలియుగంలో రాతి కొండ అని పురాణాలు చెపుతున్నాయి. అరుణాచలాన్ని ‘రెడ్‌ మౌంట్‌’, ‘హిల్‌ ఆఫ్‌ ది హోలీ బేకాన్‌’, ‘హిల్‌ ఆఫ్‌ ది హోలీ ఫైర్‌’ అని కూడా అంటారు. ఈ కొండని తేజో లింగం లేదా జ్యోతిర్లింగంగా కూడా పేర్కొంటారు. కొండ చుట్టూ ఎనిమిది లింగాలు, ఎనిమిది నందులు, 350పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. ఎనిమిది లింగాలు అంటే ఇందిరా లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం (ఈ లింగంపై ప్రజలు నాణాలు వేస్తారు), ఈశాన్య లింగంలు.

సాతనూర్‌ డ్యామ్‌:
పెన్నార్‌ నది మీద కట్టిందే సాతనూర్‌ డ్యామ్‌. దీన్ని చూడడానికి నిత్యం ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. డ్యామ్‌కు సమీపంలో ఎంతో అందంగా నిర్మించిన గార్డెన్లు, ఫౌంటెన్లు ఉన్నాయి. ఈ డ్యామ్‌కు సమీపంలోనే ఎంతో ప్రాచీన మైన తిర్న్‌కొయిలూర్‌ అనే గుడి ఉంది. దాంట్లో ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, గోపురాలు ప్రాచీన సంస్కృతి శోభను ప్రతిఫలిస్తాయి. అక్కడే క్రొకడైల్‌ పార్క్‌, స్విమ్మింగ్‌పూల్స్‌ కూడా ఉన్నాయి. ఈ ప్రదేశం తిరువణ్ణామలై నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కందాశ్రమం కొండపైన ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని కట్టడానికి ముందు భగవాన్‌ రమణ మహర్షి ఇక్కడే చాలా కాలం ఉన్నారు. ఇక్కడ నుంచి దేవాలయాన్ని, తిరుమణ్ణామలై టౌన్‌ని చూస్తే కన్నుల పండువగా కనిపిస్తాయి. దీన్ని చూడాలనుకునేవారు ఫుడ్‌, వాటర్‌ని తెచ్చుకోవాలి. విరుపాక్ష గుహలు కూడా చూడాల్సినవి. ఇవి ధ్యానానికి ఎంతో అనుకూలమైనవి. స్కందాశ్రమం నుంచి దీనికి వెళ్లొచ్చు.

స్కందాశ్రమానికి వచ్చే ముందు భగవాన్‌ ఇక్కడే ఉండేవారు. మౌంట్‌ అన్నామలై కూడా చూడాల్సిందే. ఇందులో భగవాన్‌ ఉన్నారు. అదే ఆయన ఇల్లు. అదిప్పుడు ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరుపొందింది. ఇక్కడున్న మమర గుహై చెట్లతో ఏర్పడ్డ గుహ. గింజి కోట ఉంది. ఇది 13 వ శతాబ్దంలో కట్టింది. మూడు కిలోమీటర్లలో ఇది విస్తరించి ఉంటుంది. చోళ రాజవంశీయులు ఈ కోటను కొండపైన కట్టారు. జావాధు కొండలు తిరుమణ్ణామలైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి కాకుండా, ఇంకా టైముంటే పచయ్‌అమ్మాన్‌ గుడి, భగవాన్‌ ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో ఉన్న గురుమూర్తమ్‌, పఝానిస్వామి గుడి, ఈశాన్య జ్ఞాన దేశికార్‌ సమాధి (ఇక్కడే ఈశాన్య జ్ఞాన దేశికార్‌ జీవసమాధి అయ్యారు)వంటి వాటిని కూడా చూస్తే బాగుంటుంది. అంతేకాదు ఇక్కడ చలం సమాధి కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక పర్యాటకులకు అరుణాచలం స్వర్గధామమని చెప్పాలి.

ఎప్పుడు వెళ్లాలి:
అక్టోబరు నుంచి మే నెలల్లో వెళ్లొచ్చు.
మాట్లాడే భాషలు
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు

వసతి సౌకర్యం:
తక్కువ ఖర్చులో ఉండే హోటల్స్‌ నుంచి ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ వరకూ ఇక్కడ ఉన్నాయి. బడ్జెట్‌ హోటల్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాకుండా రమణాశ్రమంలో గదులు అద్దెకిస్తారు. అయితే ఇక్కడ గదులను ముందుగానే రిజర్వు చేయించుకోవాల్సి ఉంటుంది. ‘మేక్‌మైట్రిప్‌’ వంటివి తిరుమణ్ణామలైలో మంచి హోటల్స్‌ను రిజర్వు చేయడంలాంటి సేవలందిస్తాయి.

హైదరాబాద్‌ నుంచి:
హైదరాబాద్‌ నుంచి తిరువణ్ణామలై బస్సులో వెళ్లాలంటే 753 కిలోమీటర్లు ఉంటుంది. తిరువణ్ణామలైలో ఎయిర్‌పోర్టు లేదు. దగ్గరలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి విమానం ద్వారా తిరువణ్ణామలై వేగంగా చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి తిరువణ్ణామలైకి నేరుగా ఫ్లైట్‌ సౌకర్యం లేదు. విమానంలో బెంగుళూరు లేదా చెన్నై వెళ్లి అక్కడి నుంచి తిరువణ్ణామలై సులభంగా వెళ్లొచ్చు. విమానంలో వెళ్లాలంటే టికెట్‌ ధర కనీసం 3,926 నుంచి మొదలవుతుంది.

తిరువణ్ణామలైలో రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. రహదారి సౌకర్యం బాగుంది. బస్సులు, టాక్సీలు, కార్లు ఎప్పుడూ తిరుగుతుంటాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి తిరువణ్ణామలైకి నేరుగా ట్రైయిన్‌ సౌకర్యం లేదు. హైదారాబాద్‌ నుంచి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌లో బెంగుళూరు వెళ్లి అక్కడి నుంచి తిరువణ్ణామలై వెళ్లొచ్చు. హైదరాబాద్‌ నుంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ ఉంది. చెన్నై నుంచి తిరువణ్ణామలై వెళ్లొచ్చు. టికెట్‌ ఖరీదు రూ.1944 వరకు ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి తిరువణ్ణామలైకి డైరక్టు బస్సులు ఉన్నాయి. టికెట్‌ ఖరీదు రూ.1200.

విశాఖపట్నం నుంచి:
విశాఖపట్నం నుంచి తిరువణ్ణామలైకి ట్రైయిన్‌ దూరం 933 కిలోమీటర్లు ఉంటుంది. విశాఖపట్నం నుంచి తిరువణ్ణామలైకి రెండు సూపర్‌ఫాస్ట్‌ ట్రెయిన్లు ఉన్నాయి. కనీస టికెట్‌ ధర థర్డ్‌ ఎసి రూ.1,245, సెకెండ్‌ ఎసి రూ.1,785, స్లీపర్‌ (జనరల్‌ కోటా) రూ.475. విశాఖపట్నం నుంచి తిరుపతి ఫ్లైట్‌ ద్వారా వెడితే టికెట్‌ కయ్యే కనీస ఖర్చు 3,163 రూపాయలు. తిరుపతి నుంచి తిరువణ్ణామలైకి రోడ్డుపై వెడితే 192 కిలోమీటర్లు. ట్రైయిన్‌ మీద వెడితే 198 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి తిరువణ్ణామలైకి ఒక ట్రెయిన్‌ ఉంది. "