అదివో అల్లదివో

అదివో అల్లదివో

bookmark

అదివో అల్లదివో:

అదివో అల్లదివో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము || అదివో ||

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిల మునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము || అదివో ||

చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము || అదివో ||

కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపదరూప మదివో
పావనముల కెల్ల పావనమయము || అదివో ||